దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు,
పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పెద్దపీట
- లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికీ అనుమతి
- పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం
- ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేనివారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని సీఎం తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులతో సమీక్ష నిర్వహించారు.
తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితోపాటు మండలస్థాయి అధికారులను బాధ్యులను చేయడంతోపాటు అవసరమైన సాంకేతికతను వినియో గించుకోవాలని సంబంధిత శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని.. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమ యంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబం ధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.