calender_icon.png 3 January, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని

31-12-2024 03:26:38 AM

  1. తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరుంటుంది  
  2. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దేశంలో రైతు రుణమాఫీ అమలు చేసిన తొలి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు తెలంగాణలో చేసిన రెండు లక్షల రుణమాఫీ పథకానికి ఆయనే స్ఫూర్తి అని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ భట్టి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లారని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్‌లో అవసరమైన బలం లేకున్నా యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపక్షాలను ఒప్పించారని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని స్పష్టంచేశారు. తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. మన్మోహన్ సింగ్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేప్టటిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని అన్నారు. తాను తీసుకున్న ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. 

సామాన్యుల కోణంలోనే సంస్కరణలు

దేశ ఆర్థిక పరిస్థితులతోపాటు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాల రూపకల్పన, సవరణలు తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుందని భట్టి స్పష్టంచేశారు. స్ట్రీట్ వెండర్స్ కోసం అయన తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో పేదరికంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునేలా సమాచార హక్కు చట్టం, దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాలని తీసుకొచ్చి, అటవీ హక్కు, భూసేకరణ చట్టాలను సవరించారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో దేశం ఆర్థికమాంధ్యం బారిన పడకుండా ఉపాధిహామీ చట్టమే కాపాడిందని భట్టి గుర్తు చేశారు. అమానవీయమైన స్కావెంజర్స్ చట్టాన్ని పూర్తిగా రద్దుచేసి తనలోని మానవీయతను చాటుకున్నారని కొనియాడారు. ఆ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ప్రపంచంలో భారత్ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారని తెలిపారు. ప్రధాని హోదాలో సామాన్యుడిలా ఆలోచిస్తూ మన్మోహన్ సింగ్ పాలించారని పేర్కొన్నారు. ఆయన మార్గం నేటి పాలకులకు అనుసరణీయమన్నారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి మన్మోహన్ సింగ్ మద్దతు ఇచ్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలంతా కొట్లాడినప్పుడు తమను ఏనాడూ ఒక్క మాట కూడా అనలేదని, తప్పకుండా న్యాయం జరుగుతుందని అనే వారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భువనగిరిలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని హోదాలో మన్మోహన్ పాల్గొన్నారని గుర్తుచేశారు. మన్మోహన్ పేరుతో రాష్ట్రంలో పార్క్‌ను ఏర్పాటు చేయాలని, స్కిల్ వర్సిటీకి పేరుపెట్టాలని సూచించారు. 

గొప్ప విజనరీ లీడర్ మన్మోహన్

  1. దేశం రూపురేఖలు మార్చారు
  2. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలతో దేశం రూపురేఖలు మార్చారని, ఆయన గొప్ప విజనరీ లీడర్ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అసెంబ్లీలో మన్మోహన్‌కు సంతాపం తెలుపుతూ ఆయన మాట్లాడారు. మన్మోహన్ పధానిగా ఉన్న సమ యంలోనే జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి తీసుకొచ్చారన్నారు. రామగుండం ఫ్యాక్టరీ పునఃప్రారంభంలో ఆయన పాత్ర కీలకమన్నారు.

ఆయన వల్లే 2011లో దేశంలో క్రికెట్ వరల్డ్ కప్ జరిగిందని తెలిపారు. జీ సదస్సులో మన్మోహన్ తనకు గురువని నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పినట్టు గుర్తు చేశారు. దేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప నాయకుడని.. ఆయన మన దేశంలో పుట్టడం గర్వకారణమని కొనియాడారు.