న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలలో ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు 11.11 శాతం ఓటింగ్ నమోదైందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. దోడా జిల్లాలోని ఇందర్వాల్ సీటులో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు ముందు 16.01 పోలింగ్ నమోదైంది, అయితే అత్యల్పంగా అనంత్‌నాగ్ సీటులో పోలింగ్ బూత్ వద్ద 6 శాతం మంది మాత్రమే తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకు న్నారు. కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్, జమ్మూ డివిజన్‌లోని రాంబన్, కిష్త్వార్, దోడా అనే ఏడు జిల్లాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి దశలో పోలింగ్ లో 219 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 24 నియోజకవర్గాలు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఫేజ్ 1లో ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి దశలో 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న 90 మంది స్వతంత్రులు సహా 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్ణయిస్తారు. మిగతా రెండు దశలు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.