న్యూఢిల్లీ, నవంబర్ 16: ఢిల్లీలోని సరోజినీనగర్‌లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో మహిళా బస్ డిపోను రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ శనివారం ప్రారంభించారు. దీనికి సఖి డిపో గా పేరు పెట్టినట్టు తెలిపారు. ఇందులో డ్రైవర్లు మొదలు సిబ్బంది అంతా మహిళలే ఉంటారని పేర్కొన్నారు. ఈ డిపోకు 225 మంది సిబ్బందిని కేటాయించినట్టు వివరించారు. రవాణా రంగంలో కూడా మహిళలు తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతోనే ఈ డిపోను ప్రారంభించినట్టు స్పష్టం చేశారు.
అయితే, మహిళా డిపో ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రికి మహిళా ఉద్యోగుల నుంచే నిరసన సెగ తాకింది. రవాణా రంగంలో పని చేస్తున్న తమకు సరైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదని కొందరు ఉద్యోగులు మంత్రి ముందు నిరసన తెలిపారు. ఫిక్స్‌డ్ శాలరీ, పర్మినెంట్ ఉద్యోగాలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.