14-04-2025 02:28:51 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో డా. బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెక్రటేరియట్‌లో ఎస్సీ వర్గీకరణ అమలు జీవో తొలి కాపీని మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా దళితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదని, దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకే ఈ వర్గీకరణ అన్నారు.సమానత్వం, సామాజిక న్యాయం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత, కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన ఎనిమిదన్నర నెలల కాలంలోనే వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమీన్ అక్తర్ కి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్‌కి, సీతక్కకి, శ్రీధర్ బాబుకి, మల్లు రవికి, శాసన సభ, శాసన మండలిలో వర్గీకరణకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వర్గీకరణ కోసం పోరాడుతూ అసువులు బాసిన అమరవీరులకు నివాళి అని అన్నారు. వారి త్యాగాలను ఎల్లకాలం గుర్తుంచుకుంటాం, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు, ఎంపిరికల్ డేటా, విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లను కేటాయించాలని వన్ మ్యాన్ కమిషన్ సూచించిందని తెలిపారు.
రిపోర్ట్ ఆధారంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూపు 1లో చేర్చి, వారికి 1 శాతం రిజర్వేషన్, వీరికి జనాభా ప్రకారం 0.5 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉన్నప్పటికీ, వారు అత్యంత వెనుకబడి ఉన్నందున ఒక శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి అభ్యున్నతికి అండగా నిలవడం జరిగిందని చెప్పారు. రిజర్వేషన్ల ద్వారా మధ్యస్తంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు 2లో చేర్చి, వీరికి 9 శాతం రిజర్వేషన్, మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్ కటాయించడం జరిగింది. మొత్తం 59 కులాల్లో 33 కులాలు పాత వర్గీకరణలో ఏ గ్రూపులో ఉన్నాయో, కొత్త వర్గీకరణలోనూ అదే గ్రూపులో కొనసాగుతున్నాయి. 26 కులాలు మాత్రమే షఫుల్ అయ్యాయి. మొత్తం ఎస్సీల జనాభాలో ఈ 26 కులాల జనాభా 3.43 శాతం మాత్రమే అని వ్యాఖ్యానించారు. 2026 జనాభా లెక్కల తర్వాత, ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఈ రిజర్వేషన్ల ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలి.ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదుని మరోసారి గుర్తు చేశారు. 2013లో సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సబ్ ప్లాన్ చేసే అవకాశం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సీడబ్లూసీలో సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వానికి, నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినిపించే అవకాశం దక్కడం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం భాగమయ్యే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రజలకు, మా నాయకులకు, పార్టీకి కృతజ్ఞతలు.