calender_icon.png 22 January, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లిలో కాల్పుల కలకలం

13-07-2024 01:35:14 AM

  • అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో పోలీసులపై దాడికి యత్నించిన దుండగులు 
  • ఆత్మ రక్షణలో భాగంగా కాల్పులు జరిపిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. వివరాలిలా ఉన్నాయి.. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై కొందరు దుండగులు దాడి చేసి డబ్బులు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారం అందడంతో నాంపల్లి పోలీసు లు, యాంటీ డెకాయిట్ టీమ్ సంయుక్తంగా గురువారం అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు.

స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ను ప్రశ్నిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి గొడ్డలిని తన వీపు భాగంలో పెట్టుకొని కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా, ఒక్కసారిగా వారిపై గొడ్డలితో దాడికి యత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మరో వ్యక్తి పోలీసులపైకి రాళ్లు విసి రాడు. పోలీసులు వారిని లొంగిపోవాలని చెప్పినా వినకుండా దాడి చేయడంతో, ఆత్మ రక్షణలో భాగంగా వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో మల్లెపల్లికి చెందిన ధన్‌రాజ్ (19) అనే వ్యక్తికి తొడ భాగంలో బుల్లెట్ దిగింది.

దీంతో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి బుల్లెట్‌ను బయటకు తీశారు. పోలీసులపైకి రాళ్లు రువ్విన మరో వ్యక్తి మహ్మద్ ఖాజా అలియాస్ అయాన్ (19) ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరగక ముందు కూడా నిందితులు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి నుంచి రూ.400 దొంగిలించినట్లు అంగీకరించారు. నిందితులు గతంలో కూడా చాలా చోరీలకు పాల్పడ్డారని డీసీపీ శ్వేత వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.