గోడౌన్లు, బస్ బాడి బిల్డింగ్లో ఎగిసిపడిన మంటలు
రాజేంద్రనగర్, నవంబర్ 11: నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీ, ఆరాంఘర్ చౌరస్తాలోని స్క్రాప్ గోదాముల్లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఎంఎం పహాడీలో ఉన్న బస్ బాడి బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగగా.. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచే శారు.
రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని డీఎఫ్ఓ పూర్ణచందర్ తెలియజేశారు. అలాగే ఆరాంఘర్ చౌరస్తాలోని మహేంద్ర షోరూమ్ సమీపంలో ఉన్న రెండు స్క్రాప్ గోడౌన్లలో ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే టింబర్ డిపోలు, పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ అధికారులు నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రూ.10లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పరిశ్రమలు, గోదాములు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.