11-04-2025 12:22:12 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 10 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వేసవి కాలంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలు, గోదాము లు, టింబర్ డిపోలు, స్క్రాబ్ దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల ముంపు పొంచి ఉంది. అసలే వేసవి కాలం... మండుతున్న ఎండలు... చిన్న నిప్పురవ్వ అంటుకు న్నా.. భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజల నిర్లక్ష్యం, అజాగ్రత్తతోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
తాగిపడేసిన సిగరేట్, బీడీ ముక్కలతో నిప్పు అంటుకుని, మంటలు చెలరేగుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనేక నిర్మాణాల్లో ప్రభుత్వ అనుమ తులు లేకుండా అనేక అనధికార వ్యాపారాలు కొనసాగుతున్నాయి. రసాయన పదా ర్థాలు నిల్వ చేసే గోదాములు, స్క్రాబ్ నిల్వ లు, టింబర్ డిపోలతోపాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయి.. వీటిలో చెట్లు, చెత్తాచెదారంతో నిండిపోతాయి. వేసవి కాలంలో కావడంతో పాదచారులు సిగరెట్లు, బీడీలు తాగి, మండుతున్న పీకలను గడ్డిలో వేయడంతో నిప్పు అంటుకుని మంటలు చెలరేగుతున్నాయి. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికంగా ఉం టున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వేసవి కాలంలో మరింత ముప్పు
ఈ ఏడాది ప్రారంభంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖాళీ స్థలా లు, నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న వాణిజ్య, వ్యాపార సంస్థలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్ర మాదాల నివారణ చర్యలపై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి. ఇటీవల జరిగిన పలు అగ్ని ప్రమాదాలు అన్నీ నిర్లక్ష్యంతోనే జరిగాయని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంటున్నారు. గోదాములు, పరిశ్రమల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలు
వేసవి ప్రారంభంలోనే ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. చంపాపేట డివిజన్ లోని ఒక టింబర్ డిపోలో జరిగింది. టిం బర్ డిపో నివాస గృహాల మధ్యన ఉండడం తో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఆటో నగర్ లోని ట్రాన్స్ పోర్ట్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న కంటైనర్లలో మంట లు అంటుకొని రెండు కంటైనర్లు పూర్తిగా దహనమయ్యాయి.
ఈ ప్రమాదానికి ప్రజల నిర్లక్ష్యమే కారణమని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో వరుసగా అగ్నిప్రమాదా లు సంభవించాయి. ఈ ప్రమాదాన్ని ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారంతోపాటు ఎండిన గడ్డి మొక్కలకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ప్రమాదాలన్నీ తాగి పడేసిన సిగరెట్ పీక ముక్కలతోనే జరిగాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పది రోజుల క్రితం హయత్ నగర్ డివిజన్ ముదిరాజ్ కాలనీలో ఉన్న స్క్రాబ్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు కాలడంతో మంటలు త్వరగా అదుపులోకి రాలేదు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బం ది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదం సైతం పాదచారుల నిర్లక్ష్యంతోనే జరిగింది. రెండు నెలల కాలంలోనే సుమారు పది ప్రమాదాలు జరిగాయి.
- వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రజలు, గోదా ముల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి. అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ లేదా నిప్పు అంటుకుని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఖాళీ స్థలాల్లో మంటలు త్వరగా అంటుకుంటాయి. చెత్తాచెదారం అధికంగా నిల్వ ఉండే ప్రదేశాల్లో మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది. ధూమపానం చేసే బాటసారులు, పాదచారులు సిగరెట్లు లేదా బీడీలను పూర్తిగా చల్లార్చాలి. సగం కాలిన సిగరెట్, బీడీలతో నిప్పు అంటుకుని అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు నిప్పుతో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
- యాదగిరి, హయత్ నగర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్