calender_icon.png 20 April, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సలహాదారుడు ‘వేం’ కృషితో కేసముద్రంకు ఫైర్ స్టేషన్ మంజూరు

19-04-2025 11:10:03 PM

విజయక్రాంతి ఎఫెక్ట్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో నూతనంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల అనేక అగ్ని ప్రమాదాలు సంభవించి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని, మహబూబాబాద్ నుండి కేసముద్రం అగ్నిమాపక యంత్రం రావడానికి ఆలస్యం జరగడం వల్ల నష్టతీవ్రత పెరుగుతుందనే అంశాన్ని వివరిస్తూ ఈనెల 8న విజయక్రాంతి దినపత్రికలో ‘కేసముద్రానికి ఫైర్ స్టేషన్ వచ్చేనా?’ శీర్షికతో ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. 

కేసముద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యుడు వేం నరేందర్ రెడ్డి పైనే ఆశలు పెట్టుకోగా, వేం నరేందర్ రెడ్డి కృషితోనే ప్రభుత్వం జీవో నెంబర్ 56 ద్వారా కేసముద్రం పట్టణంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 17 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కూడా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిగుప్త శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేసముద్రం సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్న వేం నరేందర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి. ఆయన ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందడం, అధికారంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అప్పట్లో ఆశించిన మేర అభివృద్ధి చేయలేకపోయారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహిత సహచరుడిగా గుర్తింపు పొందిన వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలక బాధ్యతల్లో నియమితులు కావడంతో కేసముద్రం సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

కేసముద్రం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు కేసముద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, 50 పడకల ఆసుపత్రి, సుమారు 50 కోట్లతో రోడ్ల విస్తరణ, 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, 33 కెవి సబ్ స్టేషన్లు రెండు మంజూరు చేయించారు. తాజాగా ఫైర్ స్టేషన్ మంజూరు చేయించి కేసముద్రం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషిచేసి తన సొంత మండలంపై మమకారాన్ని చాటుకున్నారు.