calender_icon.png 16 January, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నిప్పు’ రాజేసిన వర్గ పోరు!

02-07-2024 05:17:55 AM

  • కాంగ్రెస్ నేత కారు దహనం 
  • డీసీసీ అధ్యక్షుడి పనేనని బాధితుడి ఆరోపణ
  • ఖండించిన కొమ్మూరి వర్గం

జనగామ, జూలై 1 (విజయక్రాంతి): జనగామ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఓ నాయకుడి కారు దహనం ఘటన రెండు వర్గాల మధ్య నిప్పు రాజేసింది. జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ నాయకుడి కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకం రేపింది. పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎర్రమల్ల సుధాకర్ గుండ్లగడ్డలోని తన ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఒంటి గంట సమయంలో కారు మంటల్లో దగ్ధమవుతుండటాన్ని ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తి గమనించి, స్థానికులను అప్రమత్తం చేశాడు. కారుపై ఇసుక, నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. ఈ పని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డినే చేయించారని సుధాకర్ ఆరోపించా రు. కొన్ని రోజులుగా జనగామ కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి నాయకత్వం అసమర్థంగా ఉందంటూ సుధాకర్ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొమ్మూరి తనపై ఓ అక్రమ కేసు పెట్టించాడని సుధాకర్ ఆరోపించారు. కారు దహనం కూడా ఆయన పనేనని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీసీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

కొమ్మూరిపై ఆరోపణలు సరికాదు..

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎర్రమల్ల సుధాకర్‌ను హైకమాండ్ సస్పెండ్ చేసే అవకాశం ఉండటంతోనే తన కారుకు తనే నిప్పంటించుకుని కొమ్మూరిపై బురదజల్లుతున్నాడని పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి విమర్శించారు. కొమ్మూరిపై సుధాకర్ ఆరోపణలను ఖండించారు. డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఉంటూనే ప్రత్యర్థి గెలుపు కోసం సుధాకర్ పనిచేశారని ఆరోపించారు.