వరి కొయ్యలకు నిప్పు పెడుతున్న రైతులు
భూసారం తగ్గి దిగుబడులపై తీవ్ర ప్రభావం
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఆటు పర్యావరణానికి ఇటు భూసారానికి పెనుముప్పు వాటిల్లుతుంది. ప్రతి సీజన్లో వరి కోతలు పూర్తయిన తర్వాత వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దున్నే సమయంలో కోయ్యలు అడ్డుగా ఉండడంతో పాటు కొయ్యలను కాల్చడంతో పంటకు ఉపయోగపడుతున్నాయనే భావనతో చాలామంది రైతులు వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. అయితే ఈ నిప్పు నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వరి పంటలు పూర్తయి ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయి.
రబీసాగు సన్నద్ధంలో భాగంగా రైతులు తమ పంటల అవశేషాలు తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎక్కువ మంది రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొయ్యలకు నిప్పు పెట్టడం తో పర్యావరణానికి హాని కలగడంతో పాటు భూసారం దెబ్బతింటుంది. క్రమంగా తమ పొలాలు మట్టిదిబ్బగా మారే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిప్పు పెట్టిన వ్యర్థాలు పంట భూసారం పెరుగుతుందని ఎరువుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనితో ప్రతి పంటకు నిప్పు పెడుతున్నారు. దీనికి తోడు వరి కొయ్యలు ఆదేవిధంగా వదిలేస్తే దున్నే నాట్లు వేసే సమయంలో కోయదుబ్బలు పైకి లేసి ఇబ్బంది పెడతాయని ఆలోచనతో నిప్పు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తీవ్ర నష్టం-ప్రమాదాలు
పంట కొయ్యలకు నిప్పు పెట్టడంతో ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అటు పర్యావరణం కలుషితమై భూసారం తగ్గుతుంది. పంటకు మేలు చేసే పురుగులు కాలిపోవడంతో పాటు భూమి లవణాలు కోల్పోతుంది. కార్బన్ పొటాషియం పూర్తిగా దెబ్బతింటాయి. భూమి సారం కొంచెం కొంచెం కోల్పోతూ భూమి మీద ప్రభావం చూపుతాయనీ వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పూర్తిగా రసాయనిక ఎరువులు వాడాల్సి వస్తుంది. భూసారం క్రమంగా తగ్గుతూ పొలాలు మట్టి దిబ్బలుగా మారే ప్రమాదం ఉంది. పొలాల్లో ఉండే బోర్ల కరెంటు వైర్లు కాలిపోతున్నాయి రోడ్ల పక్కన మంటలు అంటుకుంటూ పక్క పొలాల్లోకి వెళ్లి గడ్డివాములు కాలిపోతున్నాయి. వాహనదారులు సైతం పొగతో ప్రమాదం బారిన పడుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం: బూర్గంపాడు మండల వ్యవసాయ అధికారి శంకర్
రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ అని మండల వ్యవసాయ అధికారి శంకర్ తెలిపారు. భూసారం తగ్గి లవణాలు, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరిం చిపోతున్నాయి. గ్రామాలలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.