శేర్లింగంపల్లి (విజయక్రాంతి): శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ లోని కొత్త గూడ చౌరస్తాలో గురువారం రాత్రి మహేంద్ర కార్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షోరూమ్ లో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇది ప్రధాన రహదారి కావడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షోరూమ్ నుంచి దట్టంగా పొగలు వెలువడడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఉద్యోగులు విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. ప్రమాదానికి గల కారణాలతో పాటు జరిగిన ఆస్తి నష్టం విలువ తెలియాల్సి ఉంది.