calender_icon.png 30 March, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ కొరియాలో కార్చిచ్చు: 24 మంది మృతి

27-03-2025 12:16:00 AM

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వ్యాపిస్తోంది. మంటల కారణంగా 24 మంది మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. శతాబ్దాల కాలం నాటి బౌద్ధ దేవాలయం ధ్వంసమైంది. స్థానిక అధికారులు మంటలార్పేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం తాజా పరిస్థితికి పొడి గాలులు వేగంగా వ్యాపించడమే కారణంగా తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన హెలికాప్టర్ కూలిపోగా, పైలెట్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఉయిసాంగ్ కౌంటీలో మంటలు వేగంగా వ్యాపించడంతో 1300 ఏండ్ల నాటి గౌన్సా దేవాలయం కాలిపోయింది.

కాగా ఆలయంలోని కళాఖండాలు, విగ్రహాలను ఇతర దేవాలయాలకు తరలించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్చిచ్చు ఆర్పేందుకు దాదాపు 10 వేల అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కార్చిచ్చు వల్ల 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. ఉత్తర, దక్షిణ జియోంగ్‌సాంగ్ ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుపై కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్ సూ స్పందిస్తూ ఇది అత్యంత ఘోరమైనదని, మంటల కారణంగా అపూర్వ నష్టం వాటిల్లునట్టు పేర్కొన్నారు.