calender_icon.png 20 January, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాగ్‌రాజ్‌లో అగ్ని ప్రమాదం

20-01-2025 12:00:00 AM

  • సిలిండర్లు పేలడంతో చెలరేగిన మంటలు
  • అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంతో అదుపులోకి
  • ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారుల ప్రకటన
  • సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్

ప్రయాగ్‌రాజ్, జనవరి 19: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గుడరాల్లో ఆదివారం సాయంత్రం సుమారు 4.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మహా కుంభమేళాలోని సెక్టార్ 19 వద్ద గుడారంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించడంతో 18 గుడారాలు అగ్గికి ఆహుతయ్యాయి.

మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. 19వ సెక్టార్‌లోని గుడారంలో వంట సిలిండర్లు పేలిపోవడం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవింద్ర కుమార్ మీడియా తెలిపారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రమాదానికి గల కారణాలను సీఎం యోగికి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.