calender_icon.png 26 November, 2024 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరాలో మంటలే!

26-09-2024 04:10:30 AM

ఫార్మా సిటీ ఏర్పాటుతో నదీ జలాలకే ముప్పు

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్ చెరువు, వాగులు మంజీరాలోకే

ఫార్మా సిటీని రద్దు చేయాలని డప్పూర్, మల్గి, వడ్డి  గ్రామస్తుల ఆందోళన

* పచ్చని పంటలు పండే భూముల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భూసేకరణ చేసేందుకు సిద్ధమైంది. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే మంజీరా నది నీరు కాలుష్య భరితం కావడం ఖాయం అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య పంటలు పండే భూములను తీసుకుంటే మేం ఏం చేసేదని ప్రశ్నిస్తున్నారు.

సంగారెడ్డి, సెప్టెంబర్ 2౫  (విజయక్రాంతి) : ఫార్మా కంపెనీలు వదిలే రసాయనాలు వాగులు, కాల్వల ద్వారా మంజీరా నదిలో కలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలను న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు.. 2003 ఎకరాల 39 గుంటల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది.

2003 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూములు సేకరిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇందులో 907.17 ఎకరాలు ప్రభుత్వ భూమి, 1096.22 ఎకరాలు పట్టా భూమి ఉంది. డప్పూర్ గ్రామంలోని సర్వే నంబర్‌లు 101,103,107 నుంచి 121,123 నుంచి 197, 205 తీసుకొనేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

వడ్డి గ్రామంలో సర్వే నంబరు 96నుంచి 100తో పాటు 119 నుంచి 124 వరకు తీసుకోనున్నారు. మల్గి గ్రామంలో సర్వే నంబర్ 86,87,121 నుంచి 124 వరకు తీసుకుంటున్నారు. టీజీఐఐసీ వారు భూసేకణ చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా కంపెనీలు ఏర్పాటుతో నీరు, గాలి కలుషితం అవుతాయని రైతులు, గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. 

ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయరాదని మూడు గ్రామాల ప్రజలు సంగారెడ్డిలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.  డప్పూర్ గ్రామం నుంచి ప్రవహిస్తున్న డప్పూర్ చెరువు, న్యాల్‌కల్ వాగు, కోట వాగు, డకలి వాగు, నక్కల వాగు నీరు మంజీరా నదిలో కలుస్తాయి. 

2003 ఎకరాల్లో..

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్ణాటకలో ని బీదర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో  ఫార్మా సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్ వడ్డి, మల్గి గ్రామాల్లో రైతుల నుంచి భూసేకరణ చేసి ఫార్మా సిటీ  ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు 2003.39 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది. 

న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్ గ్రామంలో 1526.14 ఎకరాలు భూమి సేకరిస్తుంది. ఇందులో ప్రభుత్వ భూమి 491.24 ఎకరాలు, పట్టా భూమి 1034.30 ఎకరాలు ఉంది.  వడ్డి గ్రామంలో 282.13 ఎకరాలు సేకరించేందు కు నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ప్రభుత్వ భూమి 220.23 ఎకరాలు, పట్టా భూమి 61.30 ఎకరాలు ఉంది.

మల్గి గ్రామంలో 256.01 ఎకరాలు సేకరిస్తుంది. ఇందులో ప్రభుత్వ భూమి 195.10 ఎకరాలు, పట్టా భూమి 60.31 ఎకరాలు ఉంది. వాణిజ్య పంటలు పండే భూములను ఫార్మా సిటీ కోసం తీసుకుంటున్న ప్రభుత్వం ఎలాంటి పంటలు పండని భూములు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కొందరు రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అధికారులు డప్పూర్ గ్రామంలో ఉన్న కొన్ని  సర్వే నంబర్లను తీసుకోకుండా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫార్మా సిటీతో 1,320 మంది రైతుల భూములు కోల్పోనున్నారు. డప్పూర్ గ్రామంలో 136 వ్యవసా య బోర్లు,186 వ్యవసాయ బావులు ఫార్మా సిటీలో పోతాయి. డప్పూర్ చెరువుకు 80 ఎకరాల భూమి ఉంది. 15 చెక్ డ్యాంలు, నాలుగు వాగులు కాలుష్యం అవుతాయి. ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలు, గుట్టలు కనుమరుగవుతాయి.

ఫార్మా సిటీ ఏర్పాటు కోసం గ్రామ సభలు 

ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందు కు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. న్యాల్‌కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులు, ప్రజల నుంచి అభిప్రాయలు సేకరిస్తున్నారు. భూములు ఇచ్చే రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు.

మంజీరా నది జలాలు కలుషితం

డప్పూర్‌లో ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే మంజీరా నది జలాలు కలుషితమవుతాయి. గ్రామంలో ఉన్న చెరువు, నాలుగు వాగుల నీరు శనిగేపల్లి ప్రాజెక్టు నుంచి చాల్కి శివారులో మంజీరా నదిలో కలుస్తుంది. మంజీరా నదిలో ఉన్న జీవ రాసులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఫార్మా సిటీతో వాతావరణం కలుషితమవుతుంది. ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటును విరమించుకోవాలి. వ్యవసాయం మీద రైతులు, ప్రజలు జీవనం సాగిస్తున్నరు. 

రవికుమార్, మాజీ సర్సంచ్ డప్పూర్ 

ఫార్మా సిటీని డప్పూర్‌లో ఏర్పాటు చేయరాదు

రాష్ట్ర ప్రభుత్వం డప్పూర్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయొద్దు. గ్రామ ప్రజలు, రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నరు. వాణిజ్య పంటలు పండే భూములు తీసుకోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రకృతి సిద్ధంగా ఉన్న వనరులు కనుమరుగు కావడంతో తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటును రద్దు చేయాలి డిమాండ్ చేస్తున్నాం.  

రవిగౌడ్, రైతు

వ్యవసాయ పంటలే ఆధారం

వ్యవసాయం చేసి  సాగిస్తున్నం. సర్కార్ మాకు ఉన్న భూములు తీసుకొని కంపెనీలు ఏర్పాటు చేస్తే మేం ఏం చేయాలి. వ్యవసాయం చేసుకొనేందుకు భూములు ఉండవు. కూలీలుగా పని చేసే పరిస్థితి వస్తుంది. మాకు ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూములు సర్కార్ తీసుకోవడంతో అత్మహత్యలు చేసుకోనే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది మూడు పంటలు సాగు చేసే భూములు తీసుకోవడంతో నష్టం జరుగుతుంది. రాష్ట్ర సర్కార్ ఫార్మా సిటీ ఏర్పాటును రద్దు చేయాలి. 

బ్యాగరి విఠల్