హైదరాబాద్: నగరంలోని మాదాపుర్ అయ్యప్ప సొసైటీలోని ఓ భవనం ఐదో అంతస్తులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిపుణ ఇంపాక్టింగ్ లైవ్స్ అనే కంపెనీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించిన సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపుర్ పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.