కారులో ఉన్నవారు సురక్షితం
మహేశ్వరం, జూలై 15: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. యాచారం మండలం నక్కగుట్ట తండాకు చెందిన వెంకటేశ్ నాయక్ సోమవారం సాయంత్రం తన కారులో మరో నలుగురితో కలిసి మంద మల్లమ్మ మార్గం నుంచి బాలాపూర్ చౌరస్తా వైపు ప్రయాణిస్తుండగా, జిల్లెలగూడ చందన చెరువు సమీపంలోని ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారు ఏసీలో నుంచి పొగలు వచ్చాయి. గమనించిన వెంకటేశ్ వెంటనే కారును నిలిపివేశాడు. ఆయనతో పాటు కారులో ఉన్నవారు సురక్షితంగా బయట పడ్డారు. అందరూ చూస్తుండగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఫైరింజన్ వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న మీర్పేట్ ఎస్సై సుధాకర్ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.