- రూ.2 కోట్ల ఆస్తి నష్టం
- డీసీఎంలు, యంత్ర పరికరాలు దగ్ధం
నల్లగొండ, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్ మండల కేంద్రంలో గలరంపపుపొట్టు పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం వాటిల్లింది. కట్టంగూర్‌కు చెందిన చెరుకు రమేష్, చెరుకు నాగరాజు గ్రామ శివారులో రేకుల షెడ్ ఏర్పాటు చేసి పొట్టు పరిశ్రమను నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున పరిశ్రమలో ఏర్పడిన షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. అప్పటికే మూడు డీసీఎంలు, రేకులషెడ్, యంత్రపరికరాలు, సుమారు 500 టన్నుల రంపపు పొట్టు కాలిపోయాయి. దీంతో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు బాధఙతులు తెలిపారు. నకేరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కరెంట్‌షాక్‌తో రైతు కూలీ మృతి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కరెంట్‌షాక్‌తో రైతు కూలీ మృతిచెందిన ఘటన అదిలాబాద్ జిల్లా బజార్ హాత్నుర్ మండలంలో జరిగింది. మండలంలోని మడగూడ గ్రామ సమీపంలో పత్తి చేనుకు అడవి పందుల రక్షణ కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. రైతు కూలి కొడప గంగా రాం శుక్రవారం కూలికి వెళ్తున్న క్రమంలో ఆ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య తులసి బాయి, కూతుళ్లు నాగమణి, సంగీత, కొడకు మనీష్ ఉన్నారు.