- జీడిమెట్లలో పూర్తిగా దగ్ధమైన పరిశ్రమ
- ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): జీడిమెట్ల ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ ఇండస్ట్రీస్ పాలిథిన్ సంచుల తయారీ కంపెనీలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభించిన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రిలోపు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
ఏడు ఫైరింజన్లు, 100 వాటర్ ట్యాంకర్ల సహాయంతో బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. ప్రమాదంతో ఫ్యాక్టరీలోని 2000 టన్నులు మెటీరియల్ (ముడిసరుకు), కెమికల్ డ్ర మ్ములు దగ్ధమయ్యాయి. మెషినరీ, ముడిసరుకు, రసాయనాలు, భవనం.. ఇలా అంతా కలిపి యాజమాన్యానికి రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.
అగ్ని ప్రమాదం సంభవించిన కంపెనీలో పరిశ్రమలో వంద మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని ముందే గుర్తించిన కార్మికులు బయటకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.