calender_icon.png 27 January, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం పత్తిమార్కెట్‌లో అగ్ని ప్రమాదం

16-01-2025 02:51:58 AM

* 30 లక్షల విలువైన 800 బస్తాల పత్తి దగ్ధం 

* షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా 

ఖమ్మం, జనవరి 15 (విజయక్రాంతి): ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని 3వ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఖరీదుదారులకు చెందిన దాదాపు 800 పత్తి బస్తాలు దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు 30 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి కారణాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయని అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. ప్రస్తుతానికి మార్కెట్‌కు సంక్రాతి సెలువులు కావడంతో క్రయవిక్రయాలు జరగడం లేదు.

నాలుగైదు రోజులుగా మార్కెట్  మూసి ఉంది. గతంలో ఖరీదుదారులు కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్‌లోని 3వ నెంబర్ రేకుల షెడ్డులో నిల్వ చేసి ఉంచారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.రెండు ఫైరింజన్లను రంగంలోకి దింపి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మొదటి ఒక ఫైరింజన్ అక్కడికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. అయితే మంటలు భారీగా ఎగిసిపడడంతో మరో ఫైరింజన్‌ను రప్పించారు. అప్పటికే దాదాపు 800 పత్తి బస్తాలు మంటల్లో కాలిపోయినట్లు తెలిసింది. వీటికి ఎలాంటి ఇన్స్యూరెన్స్ లేదని తెలిసింది.

మార్కెట్‌కు సంక్రాంతి సెలువులు ఇవ్వడంతో పత్తిని బయటకు తరలించకుండా అక్కడే కాంటా వేసి, మార్కెట్ యార్డులో నిల్వ చేశారు. విషయం తెలియగానే సంబంధిత అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు. 

ఘటన గురించి తెలియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఫోన్ చేసి, అగ్ని ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మంటలు వేరే యార్డులకు అంటుకోకుండా  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.