భారీగా ఎగిసిపడిన మంటలు అత్తాపూర్ హైదర్‌గూడ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో ప్రమాదం
రాజేంద్రనగర్, జనవరి 25 : ఎలక్ట్రికల్ బైక్ షోరూం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 20 వాహనాలు పూర్తిగా కాలిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ లో శనివారం జరిగింది. స్థానికులు, షోరూం యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ గూడ లోని ఎర్రబోడ ప్రాంతంలో గత ఏడాది నూతనంగా ఎలక్ట్రికల్ బైక్ షొ రుమ్ ప్రారంభించారు.
శనివారం ఉదయం నిర్వాహకులు షోరూమ్ తెరిచి పూజ చేసి రాగానే అంతలోనే మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. అపార్ట్మెంట్ పై ఫ్లోర్ లో ఉన్న రెండు కుటుంబాలు బయటకు పరుగులు తీశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు వ్యాపించకుండా నియంత్రించారు. షో రూమ్ లో సర్వీసింగ్ చేస్తున్న ఒక బైకుతో పాటు కొత్త బైకులు 19 కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. కొన్ని వాహనాలకు సంబంధించిన బ్యాటరీల నుంచి కూడా మంటలు వచ్చినట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ తో కూడా మంటలు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందో తెలియలేదు.
కన్నీటి పర్యంతమైన నిర్వాహకులు
బైక్ షోరూం లో అగ్నిప్రమాదం జరిగి 20 వాహనాలు పోవడంతో షోరూం నిర్వాహకులు లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.