- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డంపు యార్డులో చెలరేగుతున్న మంటలు
- ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది
- పట్టణమంతా వ్యాపిస్తున్న దట్టమైన పొగ
- ఏడాదికి రెండు సార్లు ఇదే తంతు
గజ్వేల్, జనవరి 18: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని చెత్త డంప్ యార్డులో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డంపింగ్ యార్డులోని చెత్త కుప్పల్లో అకస్మాత్తుగా మంటలు చెలరే గాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు నాలుగు గంటల పాటు భారీగా మంటలు చెలరేగుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నీటితో మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.
మంటలు పూర్తిగా ఆరిపోక కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డంప్ యార్డులో చెత్త మంటకు ఆహుతి కావడం సర్వసాధారణమైపోయింది. ప్రజలు వీధులలో చెత్తను కాల్చివేస్తే వాతావరణం కాలుష్యం అవుతుందని చెత్తను పోగు చేస్తున్న మున్సిపాలిటీ చెత్తను డికంపోస్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తడి పొడి చెత్తతో పాటు హాస్పిటల్లో ఫార్మసీలకు సంబంధించిన హానికర చెత్తను కూడా ఇదే చెత్తతో కలిపి పోగు చేయడంతో ఎండకు రసాయనాలు వేడెక్కి అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి.
ప్రతి ఏడాది ఇలా చెత్తకుప్పల్లో మంటలు చెలరేగి దగ్ధమై పట్టణమంతా భారీ స్థాయిలో దుర్గంధ పూరితమైన పొగ కమ్ముకుంటుంది. దీనివల్ల ప్రజలు రెండు మూడు రోజులపాటు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నా ప్రభుత్వం, పాలకవర్గం, అధికారులు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
స్వచ్ఛభారత్‌లో జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రభుత్వం దృష్టిలో స్వచ్ఛతను, రక్షణను పాటిస్తున్నట్లు పేరు పొందినా చెత్త మంటలతో, దట్టమైన పొగతో తంటాలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పాత చెత్త వల్లే ఘటన
గతంలో పట్టణ నివాస, వ్యాపార, పరిశ్రమల, ఆసుపత్రుల నుండి సేకరించిన చెత్తను ఒకే చోట వేయడంతో ఎండవేడిమికి రసాయనిక చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం కూడా పాత చెత్త కుప్పల్లోనే జరిగింది. గత కొన్ని నెలలుగా తడి పొడి హానికరమైన చెత్తను వేరువేరుగా సేకరించి కంపోస్ట్ ఎరువుగా మార్చుతున్నాం. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో మంటలు ఆర్పడానికి చర్యలు కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపాలిటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.
గోల్కొండ నరసయ్య, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్.