01-03-2025 12:00:00 AM
చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 28: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగూడ పాషాకాలనీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా మరో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం స్థానికంగా ఓ రెండస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి, పైకి వ్యాపించాయి. లంగర్‌హౌస్ నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటలను నియంత్రిస్తుండగా పై ఫ్లోర్‌లో ఐదుగురు మంటల్లో చిక్కుకున్నారని తెలుసుకొని వెంటనే నిచ్చెన సాయంతో అక్కడికి చేరుకున్నారు.
మొదటి అంతస్తులో ఉన్న ఇద్దరు మహిళలతో పాటు మరో చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.మృతుల్లో ఏడేళ్ల చిన్నారి సిజిరా ఖాతున్, జమీలా ఖాతున్ (70), సహానా ఖాతున్(40) ఉన్నట్లు డీసీపీ ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనలో మరో ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.