13-02-2025 12:28:04 PM
- ఎలక్ట్రికల్, పెయింట్స్ షాపులో ఎగిసిన మంటలు
- రూ.30 లక్షలకు పైగా నష్టం
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఓ ఎలక్ట్రికల్ షాప్ లో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. జనగామలోని హైదరాబాద్ రోడ్డులో గల జై భవాని ఎలక్ట్రికల్, హార్డ్వేర్, పెయింట్స్ దుకాణం యజమాని రోజువారీ బుధవారం రాత్రి పది గంటలకు దుకాణానికి తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి 12 గంటల తరువాత షాప్ లో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్,
ఏసిపి చేతన్ నితిన్ , జనగామ సిఐ దామోదర్ రెడ్డి, నర్మెట్ట సీఐ అబ్బయ్య వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సుమారు గంటన్నరసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నీటిలో ఫోమ్ అనే రసాయనం కలపడంతో మంటలు త్వరగా అదుపులోకి వచ్చాయి. షాపులో ప్రతిరోజు దేవుడి వద్ద దీపం వెలిగిస్తారు. ఈ దీపం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందా..? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.