టప్పర్ వేర్ షాప్‌లో ఎగిసిపడిన మంటలు
మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది
గంటపాటు ట్రాఫిక్ జామ్
ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న టప్పర్ వేర్ షాప్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం 5 గంటలకు టప్పర్ వేర్ షాపును యజమాని సిబ్బంది మూసివేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో షాపులో సాయంత్రం 6 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. నెమ్మదిగా షాప్ మొత్తం మంటలు వ్యాపించడంతో షాప్‌లో ఉన్న ప్టాస్టిక్ సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో దట్టమైన పొగలు రావడంతో బిల్డింగ్‌లో చిక్కుకున్న గోద్రేజ్ కంపెనీకి చెందిన సురేందర్, శ్రీధర్‌ను చిక్కడపల్లి పోలీసులు కాపాడారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ అధికారులు దాదాపు 5 ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా క్రాస్‌రోడ్డులో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు ఆర్పే సమయంలో ఓ ఫైర్ సిబ్బంది స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక దవాఖానాకు తరలించారు.