నిర్మల్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. వస్తువులు, ఫర్నిచర్ కాలిపోయాయి. రోగులు, సిబ్బంది ఉండే గదుల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. రెండో అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో రెండు గదుల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
రెండవ అంతస్తులో ఉన్న 40 మంది వరకు రోగులు, ఇతర సిబ్బంది భయందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు ఫైరింజన్లతో వచ్చి గంటసేపు శ్రమపడి మంటలను అదుపులోకి తెచ్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఘటనపై ఆరా తీశారు.
ఆర్డీవో రత్నకళాని, జిల్లా వైద్యులు సురేష్ కుమార్ రాజూందర్, సింగ్ సుశీల్ ఆసుపత్రిలోనే ఉండి రోగులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అత్యవసర చికిత్స చేస్తున్న రోగులను వేరే చోటకు తరలించారు. కాగా సుమారు రూ.20 లక్షల వరకు నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.