బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ప్రాంతంలో గల అక్షర ఎంటర్‌ప్రైజెస్(Akshara Enterprises)లో శుక్రవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎంటర్ప్రైజెస్ యజమాని నరేంద్రుల శ్రీధర్ బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుల నుండి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అర్ధగంటకు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా ,ఖాళీ ట్యాంకుతో అక్కడకు చేరుకోవడంతో మంటలు అదుపులోకి రాని పరిస్థితి తలెత్తింది.
బాధితులే బోర్ వేసి ట్యాంకును నీళ్లతో నింపాల్సి వచ్చింది. ఈ గతంగం పూర్తయ్యేసరికి మంటలు నాలుగు దిక్కుల దావాలంలా వ్యాపించి ఎంటర్ప్రైజెస్ పూర్తిగా దగ్ధమైంది. పరికరాలతో పాటు బొంతల నిల్వలు కాలి బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో రూ 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని శ్రీధర్ ఆవేదన చెందారు. అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తీవ్రంగా నష్టపోయామని ఆరోపించారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ లు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.