నర్సాపూర్ పోలీసుల అత్యుత్సాహం
నర్సాపూర్ (మెదక్), నవంబర్ 19: పోలీసులు అత్యుత్సాహం వారిని అభాసు పాలయ్యేలా చేసింది. ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఓ భూ వివాదంలో రెండు నెలల క్రితం నలుగురిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ నలుగురిలో ఒకరైన విఠల్ ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. అయితే కేసు విషయమై పోలీసులు విఠల్ ఇంటికి విచారణ కోసం వెళ్లగా కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీశారు. దీంతో పోలీసులు నాలుక్కర్చుకున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు కనీసం విచారణ చేయకుండా ఒకవైపు మాత్రమే తలొగ్గి కేసులు నమోదు చేస్తున్నారని నర్సాపూర్ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.