calender_icon.png 18 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 నెలల్లోగా ముగించండి

11-09-2024 03:23:21 AM

రాష్ట్రంలో బీసీ జనగణనపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో కులగణనను మూడు నెలల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కుల గణన చేసి, అమలు నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీచే సింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 5ను సవాల్ చేస్తూ జాజుల శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ సంఘం నేత ఎర్ర సత్యనా రాయణ దాఖలు చేసిన పిటీషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.

బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. 2010 నాటి కేసులో వెలువడిన తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోరాదని, రాజకీయ వెనుకబాటుతనాన్నే పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వికాస్ కృష్ణరావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులోని 13వ పేరా మేరకు రాష్ట్రమంతటికీ ఒకే తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలుకు వీల్లేదని చెప్పారు.

ఈ తీర్పు మేరకు అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. విచారణ జరిపి తగిన సమాచారం సేకరించాలని అన్నారు. ఆ వివరాల ఆధారంగానే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల గడువు కావాలని చెప్పారు. ఇరువైపులా వాదనలను విన్న ధర్మాసనం.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధ్యయనం చేసి మూడు నెలల్లో కుల గణన పూర్తిచేయాలని, అమలు నివేదికను ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసింది. విచారణను మూడు నెలల తర్వాత చేపడతామని ప్రకటించింది.  

* కుల గణన తరువాత పంచాయతీ ఎన్నికలు జరిపితే బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి.

 వీ హనుమంతరావు,

పీసీసీ మాజీ అధ్యక్షుడు 

* కుల గణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని సీఎం నిరూపించుకోవాలి.

 జాజుల శ్రీనివాస్ గౌడ్,

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు 

* బీసీల కుల గణనను వేగవంతం చేసేందుకే రాష్ట్రప్రభుత్వం బీసీ కమిషన్ కొత్త పాలక వర్గాన్ని నియమించింది. 

 నిరంజన్,

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్