16-04-2025 02:06:18 AM
ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి
దేవరకొండ, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో జాతీయ ఆహార భద్రత చట్టం- 2013 అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొం డ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు ,పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరు మెచ్చుకుంటున్నారని అన్నారు. అంత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని, అదేవిధంగా చౌకధర దుకాణాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు వంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగున్నాయని, అలాగే దేవరకొండ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెనూ ప్రకారం భోజనం, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశామని, నిబంధనల ప్రకారమే విద్యార్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినం దించారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రి లో రోగులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని, స్టోర్ రూమ్ ను ఆయన కమిషన్ సభ్యులతో కలిసి తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి 100 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం 180 మంది వస్తున్నారని , 200 పడకల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేసామని డిసిహెచ్ మాతృనాయక్ తెలిపారు.
అయితే రాష్ట్ర ఆహార కమిషన్ ద్వారా 200 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు తమ వంతు కృషిగా లేఖ రాస్తామని చైర్మన్ తెలిపారు. అంతకుముందు దేవరకొండలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి ఆహార కమి షన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ బాలుర వసతి గృహాన్ని, మైనార్టీ వసతి గృహంను సందర్శించి వంటగదిని తనిఖీ చేశారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద, భారతి, జ్యోతి, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీమ్ అలీ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి ఉన్నారు.