29-03-2025 12:05:47 AM
ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ కమిషనర్
మెదక్, మార్చి 28(విజయక్రాంతి)ః పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం సదవకాశాన్ని కల్పించింది. పన్ను చెల్లింపు చేయనివారికి పడ్డ జరిమానా, వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ సందీప్ ప్రకాశ్, రాష్ట్ర జీఎస్టీ కమిషనర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి మూడు సంవత్సరాలలో పన్ను చెల్లింపుదారులు ఎదర్కొన్న సాంకేతిక సమస్యల వల్ల పన్ను చెల్లింపులో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని తెలిపారు.
ఈ మేరకు జీఎస్టీ అధికారులు పన్ను మదింపు చేసి పన్ను, జరిమానా, వడ్డీ చెల్లించాల్సింగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పన్ను చెల్లిస్తే జరిమానా, వడ్డీలను మాఫీ చేయడానికి పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
దీని ప్రకారం 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు గాను మదింపు చేసిన పన్నుమొత్తాన్ని చెల్లిస్తే దానిపై వేసిన జరిమానా, వడ్డీలు మాఫీ చేయబడతాయని తెలిపారు. అప్పీలేట్ అథారిటీ లేదా కోర్టులో చాలెంజ్ చేసిన మదింపు ఉత్తర్వులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. అయతే ఈనెల 31లోపు చెల్లించిన వారికే ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని గడువులోగా పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని వారు కోరారు.