- తుర్కయాంజాల్ సర్వే నం. 383 లో సర్వే చేయండి
- రంగారెడ్డి కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పూర్వపు తొర్రూర్ ప్రస్తుత తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 383లోని 259 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను రెండు నెలల్లో గుర్తించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ప్రభుత్వ భూములుగా గుర్తించిన తర్వాత వాటి రక్షణ కోసం, అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు వీలుగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని ఉత్తర్వులు జారీచేసింది.
తొర్రూర్‌లోని సర్వే నంబర్ 383/2లో ప్లాట్ నంబర్ 13ను భర్త కానుకగా ఇచ్చిన ప్లాటు రిజిస్ట్రేషన్ చేసేందుకు వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ నిరాకరించడంపై టీ శైలజ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ జరిపిన విచారణకు సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ నిరాకరణకు సబ్ రిజిస్ట్రార్ తగిన కారణాలను వివరించలేకపోయారు. కొన్ని భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్ 2017లో కలెక్టర్‌కు లేఖరాశారని, ఇప్పటి వరకు ఏవిధమైన చర్యలు లేవని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఈ నెల 4న హైకోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరై సర్వే నంబర్ 383లో 259 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారని తెలిపారు. ఇందులో ఎలాంటి సబ్ డివిజన్ లేవన్నారు. ప్రభుత్వ భూమి గుర్తింపు ప్రక్రియ మొదలైందని పేర్కొన్నారు. రెండు నెలల సమయం ఇస్తే ప్రభుత్వ గుర్తింపు పూర్తవుతుందని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, సెక్షన్ 221(బి)కి సంబంధించి ప్రభుత్వ భూముల గుర్తింపునకు 2012లో ఇదే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది.
పన్నెండు ఏళ్లు గడిచిన తర్వాత రెండు నెలల సమయం కావాలని కోరడంపై మండిపడింది. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వ న్యాయవాది అంగీకరించారు. దీంతో సదరు సర్వే నంబర్లోని భూమి ప్రభుత్వానిదా ? ప్రైవేటుదా? అనేది సర్వే చేసి తేల్చాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌కు సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. పిటిషన్ విచారణను మూసేసింది.