- స్టాక్ మార్కెట్‌పై మోతీలాల్ ఓస్వాల్ అంచనా
న్యూఢిల్లీ, జూన్ 21: వచ్చే రెండు నెలలూ ఫైనాన్షియల్ షేర్లే మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ షా అంచనా వేశారు. స్వల్పకాలికంగా క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌ను కన్జూమర్ రంగం అధిగమిస్తుందన్నారు. మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయని, ఈ ఏడాది కూడా పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల బుల్న్ కొనసాగుతుందని, తాము ప్రైవేట్ బ్యాంక్‌లకంటే పీఎస్‌యూ బ్యాంక్‌లపైనే ఓవర్‌వెయిట్‌తో ఉన్నామని షా వివరించారు.
మొత్తంమీద పీఎస్‌యూ బాస్కెట్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు గత ఆరునెలల్లో మంచి ప్రదర్శన జరిపాయని, ఈ స్థాయి నుంచి కూడా హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లు మరో 20 శాతం రాబడులు ఇస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. పీఎస్‌యూ బ్యాంక్‌లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల్లో రిస్క్ వర్సెస్ రివార్డు సానుకూలంగా ఉన్నదని చెప్పారు.
ఎఫ్‌ఐఐలకు బ్యాంకింగ్‌పై మక్కువ
కొద్దికాలంపాటు భారత్ నుంచి నిధుల్ని వెనక్కు తీసుకున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇటీవల దేశీయ ఇన్వెస్టర్లను మించి తిరిగి పెట్టుబడులు జరుపుతున్నారని రాహుల్ షా చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశించినా, రెండు, మూడు రంగాలపై దృష్టిపెడతారని, అందులో ఫైనాన్షియల్స్ ఒకటి అని తెలిపారు. అందుకే గత నాలుగైదు రోజులుగా ఫైనాన్షియల్ షేర్లు ర్యాలీ జరుపుతున్నాయన్నారు. చాలాకాలంపాటు వెనుకబడి ఉన్న పెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌లు తాజాగా ర్యాలీకి నేతృత్వం వహిస్తున్నాయని, ఇది మరికొద్దికాలం కొనసాగుతుందని రాహుల్ షా చెప్పారు.