- గ్రామీణ ఆర్థిక రంగం, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత
- ప్రజాకర్షణ పథకాలకు చోటు ఉండకపోవచ్చు
- బాబు, నితీశ్‌ల డిమాండ్లు కొంత మేర నెరవేర్చే అవకాశం
- 23న కేంద్ర బడ్జెట్‌పై నిపుణులు అంచనాలు
ముంబయి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుతీరిన తర్వాత తొలి బడ్జెట్‌ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు ఈ నెల 22నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ద్రవ్య లోటు భారీగా పెరగడమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీనికి బదులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉద్యోగ కల్పనకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వవచ్చని వారంటున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో నిర్ణయించిన జీడీపీలో 5.1 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికి బడ్జెట్ కట్టుబడి ఉంటుందని, దీర్ఘకాలిక ఆర్థిక విధానానికి సంబంధించి మంత్రి విస్తారమైన ప్రకటన చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు. కార్మికులకు ఎక్కువ అవకాశం ఉండే మాన్యుఫాక్చ రింగ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా( ఎంఎస్‌ఈ) పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ కల్పనకు బడ్టెలో అధిక ప్రాధాన్యత ఉంటుందని ‘గోల్డ్‌మన్ సాచ్స్’కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త శంతను సేన్ గుప్తా పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పన అంతతమాత్రమే
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఉద్యోగ కల్పనలో మాత్రం వెనుకబడింది. రాబోయే దశాబ్దంలో కూడా 7 శాతం జీడీపీ వృద్ధి సాధించినా అది ఉద్యోగ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవచ్చని మరో ఆర్థికవేత్త సమీరన్ చక్రవర్తి ఒక నోట్‌లో పేర్కొన్నారు. 7 శాతం వృద్ధి రేటు 80 లక్షలనుంచి 90 లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలుగుతుందని, నిజానికి కావలసిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.
నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించారు. అయితే గత అయిదేళల కాలంలో ఆమె సమర్పించిన బడ్జెట్‌లలో ఆర్థిక సుస్థిరతకు పెద్ద పీట వేయడంతో పాటుగా నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడం కోసం వివిధ రంగాల్లో భారీ ఎత్తున మూలధనం పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో సైతం ఎలాంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటించకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
మారిన పరిస్థితులు
అయితే మధ్యంతర బడ్జెకు పూర్తిస్థాయి బడ్జెట్‌కు మధ్యలో పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసర మైన మెజారిటీ స్థానాలు దక్కలేదు.దీనితో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు మిత్ర పక్షాలయిన తెలుగుదేశం, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)ల మద్దతుపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు కీలక మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని డిమాండ్ చేయడంద్వారా ప్రభుత్వంపై ఈ రెండు పార్టీలు ఒత్తిడి తీసుకురావచ్చన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితేఅవేవీ జరగలేదు సరికదా, ఈ రెండు పార్టీలు ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చాయి. అయితే బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు వీలయినంత ఎక్కువ సాయం అందించాలని ఈ రెండు పార్టీలు ఇప్పుడు భావిస్తున్నాయి.
బాబు, నితీశ్‌ల డిమాండ్లు
గత అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, దీనినుంచి బైటపడాలంటే కేంద్రం ఉదారంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఇటీవల ప్రధాని మోడీ తో జరిగిన సమావేశంలో ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రధాని సైతం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు బీహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాల అవసరాలను కూడా నిర్మలా సీతారామన్ కొంత మేరకైనా తీర్చాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించడం ఆర్థిక మంత్రికి కత్తిమీద సామే. అయితే గతంలో కరోనాలాంటి భారీ సంక్షోభంనుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించిన నిర్మలా సీతారామన్ ఈ సారి కూడా తాను అనుకొన్నది సాధించడంలో కృతకృత్యులవుతారని నిపుణులు ఆశాభావంతో ఉన్నారు.
ఆర్థిక వెసులుబాటు
ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధి , మిత్రపక్షాల గొంతెమ్మ కోర్కెల మధ్య సమతుల్యత సాధించడం సీతారామన్‌కు పెద్ద సమస్యే కావచ్చని నిపుణులు అఅభిప్రాయపడుతున్నారు. అయి తే అందుకు ఆమెకు కొంత అవకాశం లేకపోలేదు. అంచనాలకు మించి గత ఆర్థిక సంవత్స రం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతం నమోదయింది. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.2 శాతం దాకా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి తోడు పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మరో వైపు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. అన్నిటికీ మించి రిజర్వ్ బ్యాంకునుంచి ప్రభుత్వానికి రూ.21 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో అందాయి. దీంతో మిత్ర పక్షాల డిమాండ్లను కొంతమేరకు తీర్చడానికి నిర్మలా సీతారామన్‌కు అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.