15-03-2025 12:26:49 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 14 (విజయ క్రాంతి): పేదవర్గాల ప్రభుత్వ వైద్య శాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు చేస్తున్న కృషి ఫలిస్తోంది. నియోజకవర్గంలో డయాలసిస్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం ఆస్పత్రిలో డయాలసిస్ మిషనలు పెంచి సేవలను విస్తరించడం, పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని సాధించడంలో కూనంనేని సఫలీకృతులయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలవరకు నియోజకవర్గంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కేవలం ఐదు యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఎమ్మెల్యేగా కూనంనేని గెలిసిన అనంతరం డయాలసిస్ రోగుల ఇబ్బందులను గుర్తించి మిషిన్ల సంఖ్యను పెంచేందుకు కృషిచేశారు. పలుమార్లు రాష్ట్ర ముఖ్య మంత్రి, మంత్రులను, వైద్యశాఖ ఉన్నతాదాధికారులను సంప్రదించి నియోజకవర్గానికి ఏడాదికాలంలో అదనంగా 15 యంత్రాలను మంజూరు చేయించగలిగారు.
ప్రస్తుతం పాల్వంచలో ఐదు మిషన్లు అందుబాటులో ఉండగా మరో ఐదు మిషన్లు, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం ఐదు మిషన్లు అందుబాటులో ఉండగా మరో ఐదు మిషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 16న ఎమ్మెల్యే చేతులమీదుగా నూతనంగా మంజూరైన మిషన్లు ప్రారంభింపచేయనున్నారు. నియోజకవర్గంలో 20 మిషన్లు డయాలసిస్ రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండగా ప్రతి రోజు రెండొందల మందికి డయాలసిస్ సేవలు అందనున్నాయి.
కొత్తగూడెం ఆస్పత్రిలో 15 మిషిన్లకు పెంచేందుకు కృషి జరుగుతోంది, ఇందుకు సంబందించిన సర్వే కూడా పూర్తి కాగా నెలరోజుల వ్యవధిలో మరో ఐదు మిషిన్లు మంజూరు కానున్నాయి. రాష్ట్ర వ్యాపితంగా ఏ నియోజకవర్గంలోనూ ఇరవై మిషన్లు అందుబాటులో లేని పరిస్థితి ఉండాగా కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలో కూనంనేని కృషితో పేద రోగులకు 20 మిషన్లు డయాలసిస్ సేవలు అందనున్నాయి. ప్రభుత్వ వైద్య శాలల్లో డయాలసిస్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్క సిట్టింగుకు సుమారు రూ.3 వేల నుంచి రూ.6వేలు వెచ్చించి పెదలు ప్రాణాలు నిలుపుకునే పరిస్థితులు అధిగమించినట్లైంది. డయాలసిస్ యంత్రాల మంజూరు కోసం, ప్రభుత్వ వైద్యం బలోపేతం కోసం కూనంనేని చేస్తున్న కృషిని పేదవర్గాల హర్షిస్తున్నాయి.