- ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’
కొత్త పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం
- ప్రిలిమ్స్‌లో పాసైన అభ్యర్థులకు రూ.లక్ష సాయం
- సింగరేణి భాగస్వామ్యంతో అమలు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): యూపీఎస్సీ అభ్యర్థులకు కోసం ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌లో శనివారం ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సింగరేణి సీఎండీ బలరామ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. విద్యార్థుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసని, ఏళ్ల తరబడిగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారని తెలిపారు.
తాము అధికారం లోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. సివిల్స్ ప్రిలిమి నరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ కోచింగ్, అవసరమైన స్టడీ మెటీరియల్, హాస్టల్ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం కింద రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి సివిల్స్‌లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ
గత పదేళ్లలో నిరుద్యోగులకు స్వరాష్ట్రంలో తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో మార్పులు చేసినట్లు తెలిపారు. పరీక్షలు తరచూ వాయిదా పడటం మంచిదికాదన్నారు. అభ్యర్థుల సమస్యను అర్థం చేసుకుని గ్రూప్ పరీక్షలను వాయిదా వేసినట్లు వెల్లడించారు. యూపీఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా పకడ్బందీగా నిర్వహిస్తోందని, వాటిపై ఆరోపణలు ఎప్పుడూ రావని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే గతంలో యూపీఎస్సీ చైర్మన్‌ను తాను కలిసినట్లు ఆయన తెలిపారు.
నిరుద్యోగుల సమస్యలే ప్రాధాన్యం
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం అన్నారు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించామని, డీఎస్సీ పరీక్షలు కొనసాగు తున్నాయన్నారు. పకడ్బందీగా ప్రణాళికతో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి మార్చ్‌లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను తెప్పించుకుంటామని, జూన్ 2 లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకే
సివిల్స్ అభ్యర్థులతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి పలు విషయాలను వారి తో పంచుకున్నారు. అభ్యర్థులను ప్రోత్సహించేందుకే తమ ప్రభుత్వం తరుఫున సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు తెలిపారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు రాణించాలని కోరారు. సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి మన రాష్ట్రానికే రావాలని, ఐఏఎస్, ఐపీఎస్‌లు మన వారైతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలోని యువత ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేదానికంటే కూడా పరీక్షలో జరిగే లోపాలపై పోరాటం చేసేందుకే వారి సమయం వృథా అయ్యిందన్నారు. అనంతరం 2023లో సివిల్స్‌కు ఎంపికైన 35 మంది అభ్యర్థులను, ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన ఆరుగురిని సీఎం, మంత్రులు జ్ఞాపికలు బహూకరించారు.
ఇది చారిత్రాత్మక నిర్ణయం
సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడమనేది చారిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ బిడ్డలు మేధస్సు కలిగినవారని, వారికి కావాల్సింది కొంత ప్రోత్సాహకమేనని తెలిపారు. సివిల్స్‌కు రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపిక కావాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. అందులోంచి వచ్చిందే ఈ పథకమన్నారు.
పథకంలోని ముఖ్యాంశాలు
* ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య దాదాపు 14 లక్షలు ఉండగా.. ఏటా తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య సుమారుగా 400 నుంచి 500 వరకు ఉంటుంది. ప్రిలిమినరీ ఉత్తీర్ణులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ప్రోత్సహక నగదును అందిస్తారు.
* తెలంగాణ నుంచి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారందరూ అర్హులే. పాసైన అభ్యర్థులు సింగరేణి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు. గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు. అభ్యర్థులకు ఒకేసారి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
సింగరేణి భాగస్వామ్యం
తెలంగాణ అభ్యర్థులకు సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. తాను సివిల్స్‌కు సన్నద్ధమయ్యే సమయంలో కోచింగ్ కోసం రూ.2 వేలు లభించక ఇబ్బంది పడ్డానని, అలాగే రూ.50 విలువ చేసే పుస్తకం కొనుగోలుకు వారం రోజుల పాటు వేచిచూ డాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసి తెలంగాణ నుంచి వీలైనంత ఎక్కువ మందిని సివిల్స్‌లో విజయం సాధించేలా ప్రోత్సహించేందుకు సింగరేణి తరఫున భాగస్వామిగా ఉండడం ఆనందకరమన్నారు.