calender_icon.png 14 October, 2024 | 3:54 AM

పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం అందజేత

11-09-2024 07:10:40 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాకు చెందిన ఇద్దరు పేద విద్యార్థులకు చదువు కొరకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ముఖ్య ప్రణాళిక అధికారి కోటయ్య నాయక్ తో కలిసి డి. ఎం. ఎఫ్. టి. నిధుల నుండి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం పూలారా గ్రామానికి చెందిన మర్సుకోల బాదిరావు కుమారుడు కృష్ణ బి- టెక్ ప్రథమ సంవత్సరం ఐ. ఐ. టి. రాయచూర్-కర్ణాటకలో, వాంకిడి మండల కేంద్రానికి చెందిన దుర్గం మహేందర్ కుమారుడు అర్జున్ బి- టెక్ ప్రథమ సంవత్సరం ఐ. ఐ. టి. జోద్పూర్ లో చదువుతున్నారని, వీరి చదువు కొరకు ల్యాప్ టాప్ కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున డి.ఎం.ఎఫ్.టి. నిధుల నుండి ఆర్థిక సహాయం క్రింద చెక్కులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువులో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ వెంకటేష్ దోత్రే

ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో అధికారులకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2025 లో భాగంగా ఇంటింటా సర్వే పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు గత నెల 20వ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగిస్తున్న ఇంటింటా ఓటర్ల సర్వే కార్యక్రమం 59 శాతం పూర్తి అయిందని, పూర్తి స్థాయిలో జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు. ఇప్పటివరకు 699 మంది ఓటర్లు గ్రామాన్ని వదిలి వెళ్లారని, 992 మంది ఓటర్లు మరణించారని, 356 ఓటర్లు ఓటరు జాబితాలో ఫోటోలు సరిగా లేవని, 291 మంది ఓటర్లు రెండుసార్లు ఓటరు జాబితాలో ఉన్నారని బూత్ స్థాయి అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీలోగా ఇంటింటా సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఓకే కుటుంబంలోని ఓటర్లను ఇంటి నెంబరు ప్రకారం ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా జాబితా రూపొందించడం జరుగుతుంది.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటా సర్వే కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సహకరించి స్పష్టమైన జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. బూతు స్థాయి అధికారులు యాప్ ద్వారా వివరాలు పొందుపరుస్తున్నారని, వివరాల నమోదులో సహకరించాలని తెలిపారు. అనంతరం ఈ వీ ఎం గోదాం ను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి మధుకర్, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.