calender_icon.png 27 December, 2024 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఖర్లో నిలువరించారు

27-12-2024 01:23:42 AM

  1. ఆస్ట్రేలియా స్కోరు 311/6
  2. నలుగురు ఆసీస్ బ్యాటర్లు అర్థశతకాలు
  3. మరోసారి మెరిసిన బుమ్రా
  4. భారత్, ఆసీస్ బాక్సింగ్ డే టెస్టు

మెల్‌బోర్న్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా, టీమిండియా తొలి రోజు సమాన ఆధిపత్యం ప్రదర్శించాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్మిత్ (68 నాటౌట్), కమిన్స్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ తీశారు. తొలి రెండు సెషన్లలో నలుగురు ఆసీస్ బ్యాటర్లు అర్థ శతకాలతో విరుచుకుపడడంతో భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఆఖరి సెషన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు కంగారూలు భారీ స్కోరు చేయకుండా నిలువరించారు.

ఇక తొలిరోజు మెల్‌బోర్న్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. బాక్సింగ్ డేను పురస్కరించుకొని మ్యాచ్‌కు 87, 242 మంది హాజరైనట్లు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రకటించింది. భారత్, ఆసీస్ మధ్య ఒక టెస్టు మ్యాచ్‌కు ఒక్కరోజులో ఇంతమంది హాజరవ్వడం ఇదే తొలిసారి.

ఆసీస్ బ్యాటర్ల దూకుడు..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు కాన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా శుభారంభం అందించారు. డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న కాన్‌స్టాస్ (65 బంతుల్లో 60) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరకు జడేజా కానస్టాస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఖవాజాకు లబుషేన్ (72) జత కలిశాడు. లంచ్ విరామం అనంతరం ఖవాజా (57) వెనుదిరగ్గా.. ఆ తర్వాత వచ్చిన స్మిత్..

లబుషేన్‌తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. టీ విరామం అనంతరం ఈ జంట ప్రమాదంగా మారుతున్న తరుణంలో సుందర్ లబుషేన్‌ను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇన్‌ఫామ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌తో పాటు మిచెల్ మార్ష్ (4)ను వరుస ఓవర్లలో బుమ్రా పెవిలియన్ చేర్చాడు. అనంతరం అర్థసెంచరీ చేసిన స్మిత్.. కమిన్స్‌తో కలిసి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.

కోహ్లీకి జరిమానా 

నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో కోహ్లీ, సామ్ కాన్‌స్టాస్ మధ్య గొడవ హైలెట్‌గా మారింది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్‌లో మూడో బంతి అనంతరం కాన్‌స్టాస్ తన గ్లోవ్స్‌ను సర్దుకుంటూ వస్తుండగా ఎదురుగా వచ్చిన కోహ్లీ అతడి భుజాన్ని గట్టిగా ఢీకొట్టాడు. దీంతో కోహ్లీవైపు కోపంగా చూసిన కాన్‌స్టాస్ మాటల యుద్ధానికి దిగాడు.

కోహ్లీ కూడా ధీటుగా బదులిచ్చాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అక్కడకు వచ్చి కోహ్లీకి సర్దిచెప్పాడు. అంపైర్లు కూడా గొడవ వద్దంటూ ఇద్దరిని వారించారు. అఏద ఓవర్లో కాన్‌స్టాస్ రెండు ఫోర్లు, సిక్సర్ బాదడం కొసమెరుపు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీకి ఐసీసీ జరిమానా విధించింది.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్ వన్ నిబంధన ఉల్లఘించినందుకు గానూ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను కేటాయించింది. 2019 తర్వాత టెస్టుల్లో కోహ్లీ జరిమానాకు గురవ్వడం ఇదే. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం కోహ్లీ తన తప్పును ఒప్పుకోవడంతో దీనిపై ఎలాంటి వాదన అవసరం లేదని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తెలిపారు.