హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఎట్టకేలకు విద్యాశాఖ డీఎస్సీ తుది కీని శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఇక త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫైనల్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను సైతం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in http:s//www.schooledu.telangana.gov.in అందుబాటులో ఉంచినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవి.నర్సింహారెడ్డి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఆగస్టు నెల చివరనే తుది కీ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ అధికారులు...నేడు రేపు అంటూ కీని వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తుది కీను తాజాగా అధికారులు విడుదల చేశారు.
ఒక్కో సెషన్‌లో ఐదారు ప్రశ్నల్లో తప్పులు!
ఆగస్టు 13న ప్రిలిమినరీ కీని విడుదల చేసి దాదాపు 28,500 అభ్యంతరాలను స్వీకరించారు. మొత్తం 26 సెషన్లలో పరీక్షలు జరిగాయి. అన్ని సెషన్లలో కలిపి దాదాపు వందకు పైగా ప్రశ్నలను మార్చినట్లు తెలుస్తోంది. తప్పుడు జవాబు, ప్రశ్నలకు మార్కులు కలిపారు.