లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు బెయిలు లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంలోశుక్రవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది. లిక్కర్ కుంభకోణం కేసులో గత మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. పది రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న ఆయనను తీహార్ జైలుకు తరలించారు.ఇదే కేసులో సీబీఐ కూడా ఆయనను జైల్లోనే కస్టడీలోకి తీసుకుంది. గతంలో ఈడీ కేసులో బెయిలు మంజూరయినా సీబీఐ కేసు కారణంగా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
తాజాగా ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిలు మంజూరయింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం న్యాయస్థానం ఆయనకు 21 రోజుల పాటు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. గడువు ముగిసిన వెంటనే ఆయన మరోసారి తీహార్ జైలులో లొంగిపోయారు. అరెస్టయిన రోజునుంచి ఇప్పటివరకు కేజ్రీవాల్ 177 రోజులు జైల్లో ఉన్నారు. అయితే మధ్యలో 21 రోజుల విరామం తగ్గిస్తే మొత్తం 156 రోజులు జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 5న తీర్పు వాయిదా వేయగా శుక్రవారం తీర్పు ప్రకటించింది. జైలునుంచి విడుదలయిన కేజ్రీవాల్‌కు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంతమంది అరెస్టయ్యారో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఎన్నో నెలల పాటు జైల్లో ఉన్న మనీశ్ సిసోడియా సహా చాలా మందికి బెయిలు లభించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌కు కూడా తప్పకుండా బెయిలు వస్తుందని ఆప్ శ్రేణులు ఆశగా ఉనాయి. ఇప్పడు ఆయనకు బెయిలు లభించడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.తన భర్త విడుదల కోసం ఇంతకాలం దృఢ వైఖరితో పోరాడిన ఆప్ కుటుంబానికి కేజ్రీవాల్ సతీమణి సునీత కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి సమస్యలు ఎదురుకావచ్చు కానీ ఓడిపోదని, కుట్రలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో సత్యమే గెలిచిందని ఆప్ నేతలు ఆతిశి, మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
కాగా కేజ్రీవాల్‌కు బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం ఆయన అరెస్టు అక్రమం కాదని, అయితే అరెస్టు చేసిన తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారం అంటే వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని తీర్పు ప్రకటించిన జస్టిస్ భుయాన్ అన్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్ బెయిలును అడ్డుకునేందుకే ఆయనను సీబీఐ అరెస్టు చేసినట్లుగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు బెయిలుపై విడుదలయినా కేజ్రీవాల్ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని, ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు షరతులు విధించడంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఫైళ్లపై సంతకాలు చేయనప్పుడు ఆయన సీఎంగా ఉండడమెందుకని వ్యాఖ్యానించింది.
బెయిలుపై విడుదలయిన కేజ్రీవాల్ ముందు హర్యానా ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడమనే పెద్దబాధ్యతే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాలు చర్చలు విఫలం కావడంతో ఆప్ అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అప్పుడే కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. వచ్చేనెల చివర్లో ఒకే విడతలో జరగనున్న ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగానే కృషి చేయాల్సి ఉంటుంది. తాను లేని సమయంలో పార్టీలో నెలకొన్న సబ్దతను తొలగించి కొత్త జవసత్వాలను నింపాల్సిన గురుతర బాధ్యత ఆయనపైఉంది. పొరుగు రాష్ట్రమైన పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఉండడం ఆయనకు కొంతమేరకు కలిసొచ్చే అంశం.బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అధికారం కోసం నువ్వా,నేనా అన్నట్లుగా పోటీ జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆప్ ప్రతిష్ఠకు ఇది సవాలే.