calender_icon.png 25 October, 2024 | 9:03 AM

ఎట్టకేలకు డీఎస్సీ హాల్‌టికెట్లు

12-07-2024 01:42:41 AM

  1. ఆలస్యంగా జారీ కావడంతో అభ్యర్థుల ఆందోళన
  2. సాంకేతిక సమస్యలతో జాప్యం
  3. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): డీఎస్సీ హాల్‌టికెట్ల జారీలో గురువారం కాసేపు గందరగోళం నెలకొంది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ముందస్తుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రకటించిన సమయానికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పొందుపర్చలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. హాల్‌టికెట్లు జారీ కాకపోవడంతో డీఎస్సీ వాయిదా పడుతుందని అభ్యర్థులంతా భావించారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఇక డీఎస్సీ వాయిదా పడుతుందనే ప్రచారం సాగింది. ఎట్టకేలకు గురువారం రాత్రి 8 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో పెట్టారు. దీంతో అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

www.schooledu.telangana.gov.inలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే హాల్‌టికెట్ల జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే అనుకున్న సమయానికి డౌన్‌లోడ్ కాలేదని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. 

మెహిందీ ఉంటే నో ఎంట్రీ 

గురువారం విడుదల చేసిన హాల్‌టికెట్ల వెనుకాల అభ్యర్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. చేతులపై మెహిందీ, ఇంకు లాంటివి ఉంటే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు దృష్ట్యా ఉదయం సెషన్ అభ్యర్థులకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ వారికి 12.30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారు.

ఉదయం సెషన్‌లో 8.45 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లు మూసివేస్తారు. పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థులను బయటికి పంపించరు. హాల్‌టికెట్, గుర్తింపు కార్డు చూపిస్తేనే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు సమాయానికి చేరుకునేలా ముందస్తుగానే పరీక్షా కేంద్రాలను సరిచూసుకోవాలని సూచించారు. వాచ్, మొబైల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లను లోనికి అనుమతించరు. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇన్విజిలేటర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇతర సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.