calender_icon.png 6 October, 2024 | 8:57 AM

టోల్‌ప్లాజాలకు కొత్త ఏజెన్సీల ఖరారు

05-10-2024 12:14:09 AM

ఏడాది కాలానికి అనుమతులు ఇచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద రుసుము వసూళ్లకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త ఏజెన్సీలను ఖరారు చేసింది.

నాలుగు వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసిన నిర్మాణ సంస్థ జీఎంఆర్ నష్టాలబారిన పడుతుండడంతో 2025 జూన్ వరకు గడువు ఉన్నప్పటికీ ఏడాది ముందే రహదారి నిర్వహణ, టోల్ రుసుముల వసూళ్ల బాధ్యతల నుంచి 2024 జూలై మాసం నుంచే  తప్పుకుంది. ఈ రహదారిపై చౌటుప్పల్, కొర్లప హాడ్, చిలకల్లు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.

దీంతో ఈ రహదారిపై టోల్ వసూళ్లను మూడు నెలల కాలానికి ఎన్‌హెచ్‌ఏఐ రెండు ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అయితే, ఈ సంస్థల నిర్ణీత గడువు ముగియడంతో తాజాగా ఈ మూడు టోల్‌ప్లాజాలను మూడు వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది.

పంతంగి టోల్‌ప్లాజాను ఇండియా మార్ట్‌కు, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాను ఈగల్ ఇన్‌ఫ్రా, చిలకల్లు టోల్ ప్లాజాను ఆప్మీ రోడ్డు సర్వీసెస్ అనే సంస్థలకు అప్పగించింది. దాదాపు ఏడాది పాటు ఈ మూడు ఏజెన్సీలు టోల్ రుసుము వసూలు చేయనున్నట్టు ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు తెలిపారు.