calender_icon.png 30 January, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై తుది నివేదిక ఫిబ్రవరి 2న సబ్ కమిటీకి

30-01-2025 02:13:16 AM

  1. 2 రోజుల్లో ముసాయిదా
  2. దేశానికే ఆదర్శంగా తెలంగాణ
  3. అధికారులు, ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందన

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : రాష్ర్టంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  అన్నారు. దీనిపై ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. సమగ్ర కులగణన సర్వే  రాష్ర్టం లో విజయవంతంగా పూర్తయిందని సీఎం పేర్కొన్నారు.

బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ర్ట ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని సీఎం అన్నారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన  బీసీ డెడికేటేడ్ కమిషన్‌కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయన్నారు. సర్వే డేటా ఎంట్రీ  పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని  అధికారులు సీఎంకు వివరించగా, ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని సీఎం ఆదేశించారు. 

నవంబర్ 6వ తేదీన రాష్ర్టంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే  మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహాయజ్ఞంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు పాలుపంచుకున్నారు.

రాష్ర్టంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివ రాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. 

కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.

ఈ  సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రికార్డు వేగంతో కులగణన..

అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ర్ట మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మా నం చేసింది.

సెప్టెంబర్ 12వ తేదీన ఇంటిం టి సర్వే కులగణన చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటయి న సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది.

అక్టోబర్ 9వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు.  అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో ప్రభుత్వం జీవో  జారీ చేసింది.

స్థానికంలో బీసీలకు 42% కోటా?

  1. రాష్ట్రంలో బీసీల జనాభా 55%
  2. ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని యోచన

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధ్దమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీగా హస్తగతం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు  కసరత్తు జరుగుతోంది. అందుకు జనాభాలో సగభాగం ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్లుతోంది.

ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామన్న హామీని అమలుచేయాలనే పట్టుదలతో సర్కార్ ముందుకెళ్లుతోంది. బీసీ రిజర్వేషన్లు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్‌ను నియమించడం,  రాష్ట్రంలో కుల గణన కూడా నిర్వహించింది. ఈ డెడికేటెడ్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలో పర్య టించింది.

ప్రజలనుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయ సేకరణ చేపట్టింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేలో గణాంకాలను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక సిద్ధంచేసింది. రాష్ట్రంలో బీసీలు సుమారు 55 శాతం ఉన్నట్లుగా సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ సర్వే నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి  ఫిబ్రవరి 2న డెడికేటెడ్ కమిషన్ అందించే అవకాశం ఉంది.

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదించి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయనున్నారు. అదే సమయంలో న్యాయస్థానాల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి రెండోవారం వరకు పూర్తిచేయాలనే  సంకల్పంతో సర్కార్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా  కోటి 16 లక్షల 14 వేల 349 స్థానాల్లో సర్వే చేశారు. నవంబర్ 9 నుంచి సుమారు 87 వేల మంది 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సామా జిక, ఆర్థిక రాజకీయ, విద్య, ఉపాధి, కులాల వారిగా అధ్యయనం చేశారు.

కుటుంబ సభ్యు వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదయం, భూములు. ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తులు, పొందిన రిజర్వేష్ల ప్రయోజనాలు సంక్షేమ పథకాల లబ్ధి, తీసుకున్న రుణాలు తదితర వివరాలను సేకరించారు. 

పంచాయతీల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1కి ఏడాది పూర్తి

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1వ తేదీతో ఏడాది కాలం పూర్తవుతోంది. గతేడాది 2024, ఫిబ్రవరి 1న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. దీంతో పల్లెలకు కేంద్రం నుంచి గ్రాంట్లు రావడం లేదు. గ్రామాల్లో అభివృద్ధి కూడా కుంటు పడింది. త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయని సర్కార్ భావిస్తోంది.