calender_icon.png 29 December, 2024 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌన మునికి తుది వీడ్కోలు

29-12-2024 01:39:49 AM

* ప్రభుత్వ లాంఛనాలతో నిగమ్‌బోధ్ ఘాట్‌లో ముగిసిన  మన్మోహన్ అంత్యక్రియలు

* నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులు

* అంతిమ యాత్రలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు

* పాడె మోసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

* మన్మోహన్‌ను ప్రభుత్వం అవమానించిందన్న రాహుల్

* స్మారక స్థలం కేటాయించేందుకు ఓకే చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మౌన ముని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మౌనమునికి ఘన వీడ్కోలు పలికారు. ఆర్థిక సంస్కరణల పితామహున్ని కడసారి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. సీడబ్ల్యూసీ డిమాండ్ మేరకు ఆయన స్మారక స్థలం కేటాయించనున్నట్లు కేంద్ర మంత్రివర్గం కూడా తెలిపింది.

ఆయనకు కన్నీటి నివాళి అర్పించేందుకు మన దేశంలోని ప్రముఖులు మాత్రమే కాకుండా వివిధ దేశాల ప్రముఖులు కూడా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు స్మారక స్థలం కేటాయించనున్నట్లు తెలిపింది. క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. 

పాడెమోసిన రాహుల్ గాంధీ.. 

ప్రజల సందర్శనార్థం మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకురాగా... అక్కడి నుంచి ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంలో సింగ్ అంతిమయాత్ర మొదలైంది. అంతిమయాత్ర దారి పొడవునా ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే’ అనే నినాదాలు దద్దరిల్లాయి. వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, సాధారణ జనంతో రహదారి మొత్తం కిక్కిరిసింది.

దారి పొడవునా వారు పూలు చల్లుతూ మన్మోహన్‌కు వినమ్రంగా వీడ్కోలు పలికారు. త్రివిద దళాల అధిపతులు మన్మోహన్ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు చేరుకున్న తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్ది సేపు మన్మోహన్ సింగ్ పాడె మోశారు. మన్మోహన్ సింగ్ చితికి ఆయన కూతురు నిప్పంటించారు.  

రాష్ట్రాల్లో సంతాప దినాలు

మన్మోహన్ సింగ్‌కు సంతాపంగా కేంద్రం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా మన్మోహన్ కోసం ప్రత్యేక సంతాప దినాలను ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలకు సెలవులు మంజూరు చేశాయి. 

విదేశీ ప్రముఖులు కూడా.. 

మన్మోహన్‌ను కడసారి చూసేందుకు వివిధ దేశాల ప్రతినిధులు కూడా తరలివచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. వారందరితో పాటుగా భూటాన్ రాజు వాంగ్‌చుక్, మారిషస్ విదేశాంగ శాఖ మంత్రితో పాటు ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు.

అనేక దేశాల ఎంబసీలు, నేతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు హాజరై మౌనమునికి తుది వీడ్కోలు పలికారు.