హైకోర్టు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేయాలంది. తగిన కారణాలు లేకుండా ఎన్నికలను నిలిపివేయడం చెల్లదని, చట్టప్రకారం నోటిఫికేషన్ జారీ చేశాక ఎన్నికలను నిర్వహించకుండా ఉండేందుకు వీల్లేదని వెల్లడించింది. ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే ఆపేస్తూ రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి జూన్ 13న ఇచ్చిన ప్రొసీడింగ్లను రద్దు చేయాలంటూ పీ ఉదయభాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారించారు.
పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిస్తూ, గత మే 20న ఫిలింనగర్ సొసైటీ పాలకమండలి గడువు ముగిసిందని, అంతకుముందే రాష్ట్ర సహకార సంఘాల డైరెక్టర్ ఎన్నికల నిర్వహణకు రికార్డులు సమర్పించాలని ఆదేశాలిచ్చారని చెప్పారు. ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ ఓటర్ల లిస్టుతో పాటు రికార్డులను అందజేశారని వివరించారు. ప్రతిపాదిత ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు కోరుతూ నోటీసు కూడా ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణాధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను నియమించారని, దీంతో జూన్ 7న ఎన్నికల షెడ్యూలును విడుదల చేసి, 11, 12, 13 తేదీల్లో కమిటీ మెంబర్లు పోస్టులకు నామినేషన్లు సమర్పించాలని ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువరించారని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ఎన్నికలను నిలిపివేస్తూ జూన్ 13న రాష్ట్ర సహకార సంఘాల ఎన్నికల అధికారి ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. సహకార సంఘాల నిబంధన 22సీకి వ్యతిరేకంగా ఎన్నికలను నిలిపివేశారన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకపోయినా ఎన్నికలను వాయిదా వేయడం చెల్లదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, ఎన్నికలను వాయిదా వేయడానికి తగిన కారణమే లేదని, ప్రక్రియ ఆపిన దగ్గరనుంచే తిరిగి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార సంఘం, ఫిలింనగర్ సొసైటీ తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.