హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. దిల్ రాజుతో పాటు డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఎఫ్డీసీ ఛైర్మన్ గా నియమించారని చెప్పారు. తను అమెరికాలో ఉన్నందున ఇన్ని రోజులు రాలేకపోయానన్ని దిల్ రాజు పేర్కొన్నారు. అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రిని కలిసే ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తానని, సినిమా ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటూ, రేవతి భర్త భాస్కర్ కు ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. సంధ్య థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదు.. అది ప్రమాదవశాత్తు జరిగిన దురదృష్టకర ఘటన అని దిల్ రాజు వాపోయారు. చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారమని, చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని, సినీ పరిశ్రమ ప్రతినిధులమంత ఒకట్రెండు రోజుల్లో సీఎంను కలుస్తామని చెప్పారు. చిత్రపరిశ్రమకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనపై ఉందని దిల్ రాజు పేర్కొన్నారు.