01-04-2025 10:30:50 PM
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన ‘లక్కీభాస్కర్’, ‘డాకుమహారాజ్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన చిత్రమే ‘మ్యాడ్ స్క్వేర్’. ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్‌శంకర్ దర్శకత్వం వహించారు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
“డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో ఉంచుకొని, మొదటి వారాంతం కొన్నిచోట్ల టికెట్ ధరలను పెంచాం. ఇకపై అన్నిచోట్లా సాధారణ టికెట్ ధరలతోనే మా సినిమా అందుబాటులో ఉంటుంది. సీక్వెల్ హైప్‌తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా అంత కన్నా కాదు. అయినా ప్రేక్షకులు సినిమా చూస్తున్నారంటే, కారణం వినోదమే. ఇది ప్రేక్షకుల విజయం” అని చెప్పారు.
ఇక ఈ సినిమా గురించి రాసిన రివ్యూల గురించి కూడా నాగవంశీ స్పందించారు. “రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాం. కానీ, కొందరు సినిమాను చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి” అన్నారు.