calender_icon.png 23 December, 2024 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మృతి

07-09-2024 12:12:31 AM

  1. లలిత గీతాల రచయితగా ప్రత్యేక గుర్తింపు
  2. పరిశోధకుడు, దర్శకుడిగానూ అద్భుతమైన ప్రతిభ

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన కృష్ణ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించారు. రచయితగానే కాకుం డా పరిశోధకుడిగా, దరకుడిగా అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.

సాహిత్య రంగంలో వడ్డేపల్లి కృష్ణ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. లలితాగీతాల రచయితగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో ప్రఖ్యాతిగాంచారు. పిల్ల జమీందారు, భైరవ దీపం, అమృతకలశం, పెద్దరికం, పిలిస్తే పలుకుతా లాంటి చిత్రాలకు పాటలు రాశారు. సాయికుమార్ హీరోగా నటించిన ఎక్కడికి వెళ్తుందో మనసు సినిమాకు కృష్ణ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన లావణ్య విత్ లవ్‌బాయ్స్ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన గోభాగ్యం అనే షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి.

బతుకమ్మ, రామప్ప రమణీయం లాంటి లఘు చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు. జయజయహే తెలంగాణ నృత్య రూపకాన్ని రచించింది ఈయనే. దాదాపు 40కిపైగా నృత్య రూపకాలు రాశారు. ప్రముఖ సినీగేయరచయిత సినారే సైతం వడ్డేపల్లి కృష్ణ రచనలను బాగా ఇష్టపడేవారు. పదివేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ కూడా పూర్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. నాలుగు రోజుల కిందటే సినీ రచయితల సంఘం ఆయన్ను జీవనసాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఇంతలోనే ఇలా జరగడంపై తెలుగు కవులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 

వడ్డేపల్లి కృష్ణ మరణం బాధాకరం:  కేటీఆర్ 

సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ మరణ వార్త ఎంతో బాధించింది. సిరిసిల్లలోని చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. సాహిత్య రంగంలో కృష్ణ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కడం విశేషం. ఆయనతో ఎప్పుడు మాట్లాడిన సాహిత్య రంగానికి మరింత సేవ చేయాలనే తపనే కనిపించేంది. లలితా గీతాల రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.