calender_icon.png 17 November, 2024 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటి కస్తూరి అరెస్ట్

17-11-2024 01:46:50 AM

  1. మణికొండలో అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు
  2. తెలుగువారిపై వివాదస్పద వ్యాఖ్యల కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి) : తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని కించపరిచేలా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశా రు. శనివారం సైబరాబాద్ పోలీసుల సాయంతో నార్సింగి పోలీసుస్టేషన్ పరిధి మణికొండ పుప్పాలగూడలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో ఓ నిర్మాత ఫ్లాట్‌లో ఉంటున్న ఆమెను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కస్తూరిని చెన్నైకి తరలించారు. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి.. ‘300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు’ అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె మండిపడ్డారు.

ఇతరుల ఆస్తులను లూటీచేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు తమిళనాడులోనూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదురుతోందని గ్రహించిన కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు.

అయితే నటి వ్యాఖ్యలపై తమిళనాడు మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఇందులో భాగంగా కస్తూరికి సమన్లు ఇవ్వడానికి ఇటీవల పోలీసులు పోయెస్ గార్డెన్‌లోని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె మొబైల్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి మణికొండ పుప్పాలగూడలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు.