calender_icon.png 28 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

15-10-2024 03:13:58 AM

ఉపాధి రంగాల్లో వారికి అవకాశాలు తక్కువ

వారికోసమే ప్రత్యేకంగా ఆన్‌లైన్ జాబ్ పోర్టల్

ప్రైవేట్‌లోనూ 4 శాతం రిజర్వేషన్లకు ప్రయత్నిస్తున్నాం

దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

దివ్యాంగుల ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ను మొదలుపెట్టామని, త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. సచివాలయంలో సోమవారం తెలంగాణ దివ్యాంగుల ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అని, ఇతర వర్గాల వారిలా పోరాడాలంటే ఎన్నో అవరోదాలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని, పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.

అందుకే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నా మని వెల్లడించారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.

దివ్యాంగుల అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని, అందుకోసమే జాబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామని స్పష్టంచేశారు. సంక్షేమ నిధుల్లోనూ 5 శాతం దివ్యాం గులకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ జాబ్‌ల్లోనూ 4 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

సంక్షేమ పథకాల్లోనూ ప్రాధాన్యత 

ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. డిసేబిలిటీని దృష్టిలో పెట్టుకుని వారిని ముందుకు తీసుకురావాడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమం, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.

దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను నేరుగా తమతో పంచుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం సమాచారం ఇచ్చినా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్‌లైన్‌లో పది మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. వారిలో సుహాసిని(అడ్మినిస్ట్రేటర్), ఎం లక్ష్మీ(ఐటీ సూపర్వైజర్), కాల్ ఆపరేటర్లు మామిడి  లావణ్య, లలిత, పార్వతమ్మ, సునీత, నాగలక్ష్మి, రజిత, సుమిత్రా, శోభారాణి ఉన్నారు.